" మీ భాషను మార్చుకోండి, అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి."
కార్ల్ ఆల్‌బ్రెక్ట్

బీరెల్లి శేషి, ఎం.డి.

వ్యవస్థాపకుడు & అధ్యక్షుడి యొక్క సందేశం

డాక్టర్ శేషి యొక్క బహుళభాషావాదం కొరకు అంతర్జాతీయ కేంద్రం
వైవిధ్యం మా పరంపర

బీరెల్లి శేషి, ఎం.డి.
bseshi@multilanguaging.org
bseshi@outlook.com

ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఐదు వేర్వేరు భాషలను బోధించడానికి / నేర్చుకోవడానికి ఏకకాలిక బహుభాషా విధానం: ఒక విద్యా ప్రతిపాదన

భారతదేశం సుమారు 1,600 భాషలు గల బహుభాషా దేశం, అవి ఎలా నిర్వచించబడ్డాయి మరియు లెక్కించబడ్డాయి అనేదాని ఆధారంగా.
వాటిలో ఇరవై రెండు దాని రాజ్యాంగం ద్వారా గుర్తించబడ్డాయి మరియు వాటిలో ఆరు సాంప్రదయకమైనవిగా ప్రకటించబడ్డాయి.
వైవిధ్యం మధ్య ఐక్యతను ఎలా సాధించాలి అనేది భారతదేశం యొక్క ప్రోత్సహించవలసిన-లక్ష్యంగా ఉంది.
అటువంటి లక్ష్యం దిశగా, 1947 లో గ్రేట్ బ్రిటన్ నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి మూడు భాషలను (ఒకరి మాతృభాష, జాతీయ భాష, హిందీ మరియు అంతర్జాతీయ భాష, ఇంగ్లీష్) బోధించే పద్ధతి అమలులో ఉంది.
అవి భారతదేశ సాంస్కృతిక జీవనాడిని ఏర్పరచినప్పటికీ, సంస్కృతం మరియు ఉర్దూ అనే మరో రెండు జాతీయ భాషలు బోధించబడలేదు మరియు నిర్లక్ష్యం చేయబడ్డాయి.
దురదృష్టవశాత్తు, సంస్కృతం మరియు ఉర్దూ వరుసగా హిందూ మతం మరియు ఇస్లాంతో ముడిపడివున్నాయి, మరియు వాటి బోధన ఆధునిక భారతదేశ వ్యవస్థాపక పితామహుల ద్వారా ప్రస్తుత సామాజిక-రాజకీయ పూరిత వాతావరణం ఆధారంగా అనాదరింపబడి ఉండవచ్చు.
అది పొరపాటు కాకపోవచ్చు, బదులుగా ఒక అవసరం కావచ్చు, అని నేను భావిస్తున్నాను.
అది గతంలో జరిగింది.

పరస్పర అవగాహన మరియు సహనాన్ని మనం కోరుకుంటే భాషను మరియు మతాన్ని విడదీయబడాలి.
నాకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే, 'మూడు జాతీయ భాషలను (హిందీ, సంస్కృతం మరియు ఉర్దూ), ఒక అంతర్జాతీయ భాష (ఆంగ్లము) మరియు ఒక స్థానిక భాష (నా మాతృభాష అయిన తెలుగు) అన్నిటినీ ఏకకాలంలో ఒకటవ తరగతి (గ్రేడ్) నుండి ప్రారంభించి బోధించడం లేదా నేర్చుకోవడంను ఎలా ఊహించగలం? '
ఈ ప్రతిపాదన యొక్క మూలస్తంభం ఏమిటంటే, ప్రతి తరగతిలోని ప్రతి పాఠం యొక్క విషయం లేదా అంశ విషయం మొత్తం ఐదు భాషలలో ఒకేలా ఉంటుంది మరియు మొత్తం ఐదు భాషల యొక్క ప్రతినిధిని లేదా ఐదు భాషల విషయాలను కలిగి ఉంటుంది.
ఉదాహరణకు, విద్యార్ధులు ప్రేమ్‌చంద్ (అసలైనది హిందీలో), కాళిదాసు (అసలైనది సంస్కృతంలో), ఇక్బాల్ (అసలైనది ఉర్దూలో), టెన్నిసన్ (అసలైనది ఆంగ్లంలో), మరియు వేమన (అసలైనది తెలుగులో) లలో ప్రతి ఒక్కరి ద్వారా ఎంచుకున్న ఒక పద్యం ను మొత్తం ఐదు భాషలలో నేర్చుకుని, బహుభాషా, భిన్న సాంప్రదాయక కుటుంబంలో కలిసి పుట్టి పెరిగినట్లుగా బృందగానంలో పాడుతారు.
అదేవిధంగా, విద్యార్థి సిండ్రెల్లా మరియు అలీబాబా మరియు నలభై దొంగల కథలను ఐదు భాషలలో నేర్చుకుంటారు.

ఈ బోధనా పధ్ధతి యొక్క దృఢమైన దృష్టాంతాలు మరియు సామాజిక సందర్భాలను అందించడానికి, రోజువారీ పాఠశాల జీవితంలో విద్యార్థులు, ఒక సంభాషణ సమయంలో ప్రతి విద్యార్థి నిమిష నిమిషానికి ఒక భాష నుండి మరొక భాషకు మారుతూ, ఐదు వేర్వేరు భాషలలో మాట్లాడుతున్న దృశ్యాన్ని చిత్రించండి.
అదేవిధంగా, వేర్వేరు పాత్రలు ఐదు వేర్వేరు భాషలను మాట్లాడుతూ, ప్రతి పాత్ర ఒక డైలాగు నుండి మరొక డైలాగుకు భాషను మార్చే ఒక పాఠశాల నాటికను చిత్రించండి.
అంతిమ ఫలితాన్ని ఊహించడానికి, కొత్త తరం పౌరులు ఒకేసారి దిగంతం మీద పైకి లేచి ఐదు వేర్వేరు భాషలలో సౌకర్యవంతంగా మరియు విశ్వాసంతో మరియు స్పష్టంగా మరియు లాఘవంగా సంభాషించడాన్ని చిత్రించండి.

ప్రతి పాఠంలో ఐదు భాషలలో ఆ పాఠం నుండి గుర్తించబడిన ఒక ముఖ్య పదం లేదా పదజాల సంగ్రహం ఉంటుంది, ఒక ఉదాహరణగా ఈ సందేశం కోసం అందించబడిన మాదిరిగా.
1 నుండి 10 వరకు వేరుగా, ప్రతి తరగతికి అన్ని పాఠాల నుండి తీసుకోబడిన ఐదు భాషలలో మిశ్రమ పునరావృతం కాని పదజాల జాబితాను సిద్ధం చేయడం ను అదనంగా సాధించవచ్చు.
ఈ జాబితాను ప్రతి సంవత్సరపు తరగతి పాఠ్యపుస్తకానికి ఒక అనుబంధంగా చేర్చవచ్చు.
అన్ని మునుపటి తరగతులు / సంవత్సరాల నుండి పదాలు ఆ సంవత్సరపు జాబితా నుండి మినహాయించబడతాయి.
ఇది ప్రతి జాబితాను ఆ తరగతి/సంవత్సరానికి ప్రత్యేకమైనదిగా మరియు సులభంగా నిర్వహించగలిగేలా చేస్తుంది.
ప్రతి తరగతి / సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే కొత్త పదజాలం ప్రకారం పాఠ్యప్రణాళికను ప్లాన్ చేయడానికి /రూపొందించడానికి మరియు అంచనా వేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.
తద్వారా విద్యార్థులు వారు చివరికి గ్రాడ్యుయేషన్ వైపు వెళ్ళేటప్పుడు ప్రతి సంవత్సరం నేర్చుకున్న లేదా తెలుసుకున్న అన్ని పదాల యొక్క పూర్తి ఉపయోగం మరియు జాగ్రత్తపూర్వక లెక్కను కలిగి ఉంటారు.
ఇతర విద్యావేత్తల ద్వారా చేపట్టబడుతున్న పదాలకు ఇటువంటి సమగ్రమైన బోధనా విధానం నాకు ఇంతకుముందు తెలియదు.
ఇది ప్రస్తుత ప్రతిపాదన యొక్క మరొక ముఖ్యమైన లక్షణాన్ని సూచించే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ నమూనాలో, పదాలు మీ స్నేహితులు, మరియు ప్రతి పదం లాక్షణికంగా ఒక ‘అవతార్’ మరియు దాని సొంత అవయవ నిర్మాణ పరమైన జీవితాన్ని కలిగి ఉంటుంది.
విద్యార్థులు వాటిని సరిగ్గా నేర్చుకుంటారు, ఉపయోగిస్తారు మరియు వ్యవహరిస్తారు.

సంరక్షించే మరియు పట్టించుకునే తల్లిదండ్రులు పిల్లల యొక్క విస్తారమైన నేర్చుకునే సామర్థ్యం గురించి తెలుసుకోవడంలో సౌకర్యవంతంగా ఉండవచ్చు.
మాంటిస్సోరి విధానం వ్యవస్థాపకులు డాక్టర్ మరియా మాంటిస్సోరి దీనిని ఇలా ఉత్తమంగా వర్ణించారు, "పుట్టుక నుండి ఆరేళ్ల వయస్సు వరకు గ్రహించే మనస్సు గల పిల్లలు తమ వాతావరణంలో సామర్థ్యాన్ని సాధించడానికి మరియు నైపుణ్యాలు మరియు అవగాహనలను మెరుగుపరుచుకోవడానికి అపరిమితమైన ప్రేరణను కలిగి ఉంటారు.
ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఒకటి కంటే ఎక్కువ భాషలను సులువుగా మరియు హాయిగా గ్రహిస్తారని కూడా గుర్తించబడింది.
క్రొత్త భాషా అభ్యాస సామర్థ్యం 18 సంవత్సరాల వయస్సు వరకు అత్యధికంగా ఉంటుంది, ఆ తరువాత అది క్షీణిస్తుంది మరియు పటిమను సాధించడానికి అభ్యాసం 10 సంవత్సరాల వయస్సులోపు ప్రారంభం కావాలి అని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ప్రతిపాదన ఒక కొత్త పధ్ధతి.
కొత్త తరగతి విషయాన్ని ‘మా భాషలు’ అని సూచించవచ్చు.
ఇది ఒక ఏకీకరించబడిన అంశంగా గా బోధించబడుతున్నట్లు/నేర్పబడుతున్నట్లుగా ఊహించబడుతుంది.
ఇది ‘మై ఇంగ్లీష్ వరల్డ్, లేదా అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్,’ ‘జాబిలి, లేదా తెలుగు వాచకం’ మరియు ‘బాల్-బగీచా’ వంటి ప్రస్తుతం ఉన్న ప్రత్యేక తరగతి అంశములను భర్తీ చేస్తుంది.
ఇది ఏదైనా భాషను మొదటి భాషగా లేదా రెండవ భాషగా గుర్తించవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.
క్రొత్త పాఠ్యపుస్తకం, అది ఐదు భాషల బోధనను అనివార్యం చేసినప్పటికీ, పరిమాణంలో తప్పనిసరిగా పెద్దదిగా ఉండాలి, కాని ప్రస్తుత మూడు పుస్తకాలను కలిపినంత పెద్దది కానవసరం లేదు.
సౌలభ్యం కోసం, దీనిని మూడు భాగాలుగా విభజించి, వీటిని క్వార్టర్స్, Q1- Q3 గా గుర్తించవచ్చు.
విద్యార్థి ప్రతి తరగతిలో ఒకేసారి ఐదు వేర్వేరు భాషలకు బహిర్గతం అవుతాడు మరియు ఐదు వేర్వేరు భాషలలో ఒకే విషయం/పాఠాన్ని నేర్చుకుంటాడు.
ఐదు భాషలలో ఉన్నప్పటికీ, అంశ విషయం ఒకేలా ఉన్నందున సమాచారం యొక్క పరిమాణం బాగా తగ్గిపోతుంది మరియు ఇది విద్యార్థులకు అధిక భారం కాబోదు.
నా అంచనా ఏమిటంటే, భాషలను ఇలాంటి తులనాత్మక/సహసంబంధమైన పద్ధతిలో నేర్చుకోవడం 60 ఏళ్ళకు పైగా ఉన్న ప్రస్తుత వ్యవస్థలో ఉన్నట్లుగా, సంబంధం లేని అంశ విషయానికి సంబంధించిన మూడు భాషలను నేర్చుకోవడం కంటే దానిని సాపేక్షంగా మరింత సులభతరంగా, ఆసక్తికరంగా మరియు శక్తివంతమైనదిగా చేస్తుంది.

అంతేకాక, ఇది పూర్తిగా సంబంధం లేని ఐదు భాషలను నేర్చుకోవడం అని కాదు; మొత్తం ఐదు ఇండో-యూరోపియన్ భాషల కుటుంబ నుండి ఉద్భవించినవే.
హిందీ మరియు తెలుగు భాషలు విస్తృతమైన సంస్కృత నిఘంటువును కలిగి ఉన్నాయి.
హిందీ మరియు ఉర్దూలు ఉమ్మడి వ్యాకరణం మరియు రోజువారీ పదజాలం ను కలిగి ఉన్నాయి, మరియు ఉన్నత శ్రేణి నిఘంటువులో మాత్రమే వేరుగా ఉండవచ్చు, హిందీ సంస్కృతం నుండి భారీగా తీసుకోబడగా, ఉర్దూ పెర్షియన్ మరియు అరబిక్ ల నుండి తీసుకోబడింది
ఇంగ్లీష్ (లాటిన్ మరియు గ్రీకు ద్వారా) సంస్కృతంతో చాలా మూలాలను పంచుకుంటుందని బాగా తెలుసు.
ఇది అంతగా తెలియని విషయం, కానీ నేను గమనించినట్లుగా, తెలుగు వ్యాకరణంలో భాగంగా స్పష్టంగా బోధించబడిన సంస్కృత సంధి నియమాలు ఆంగ్ల ఉచ్చారణకు కూడా అంతే సమానంగా వర్తించవచ్చు, ఎందుకంటే అన్ని భాషల శబ్దాలు ఒకే నిర్మాణ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి.
అందువల్ల, ఉమ్మడి మూలాలు లేదా పదజాలం, వ్యాకరణం మరియు ధ్వనిశాస్త్రం లను విభిన్న స్థాయిలలో స్పష్టంగా భాగస్వామ్యం చేయడం ఉంది.
మన భాషల యొక్క అనుసంధానం గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం.
లేత మరియు ఎదుగుతున్న మెదడులకు ఈ సంబంధాలను చూడటం మరియు సహసంబంధమైన ఆలోచనను ప్రారంభంలోనే మనస్సులోకి చొప్పించడం మనోహరంగా ఉంటుందని నేను నమ్ముతాను.

నా నినాదం ఏమిటంటే, మీరు భాషాపరంగా అనుసంధానించబడితే, మీరు సాంస్కృతికంగా అనుసంధానించబడినట్లే.
ఈ ప్రతిపాదిత బోధనా విధానం విమర్శనాత్మక ఆలోచనను మెరుగుపరుస్తుందని, కేవలం సహనాన్ని మాత్రమే కాకుండా ఒకరి పట్ల మరొకరికి అభిమానాన్ని కూడా ప్రోత్సహిస్తుందని మరియు చివరికి విద్యార్థులందరినీ ఒకే స్థాయి ఆట మైదానంలో ఉంచుతుందని భావించబడుతుంది.
భాషలను నేర్చుకోవడం అనేది బలోపేతం కావడం, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, మేధోపరంగా మరియు చివరికి వృత్తిపరంగా.
అది అందరి కోసం సమాన అవకాశం కావచ్చు.

ఈ ప్రతిపాదన సామాన్యశాస్త్రం, గణితం మరియు సాంఘిక శాస్త్ర విషయాల బోధనను ప్రభావితం చేయదు; వాటిని పాఠశాల బోధనా మాధ్యమంలోనే బోధించటం కొనసాగుతుంది.

ఈ ప్రతిపాదన శాస్త్రీయ విచారణ స్ఫూర్తితో ఉద్భవించిందని నేను నొక్కిచెప్పాలనుకోవచ్చు.
పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ముందు ఈ అంశాన్ని పరిశోధించడం, ఆలోచించడం మరియు దాని పూర్తి సామర్థ్యాన్ని ఒక ప్రయోగాత్మక స్థాయిలో క్రమపద్ధతిలో అధ్యయనం చేయడం అవసరం.
ఈ ప్రతిపాదిత పద్ధతి, ప్రస్తుతం ఉన్న పద్ధతిలో, ఆసక్తిగల పాఠశాలలు మరియు/లేదా సమూహాల ద్వారా సమగ్రంగా మరియు ప్రయోగాత్మకంగా ప్రయోగించబడవచ్చు.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చే పాఠశాలలకు నిధులు సమకూర్చడం ద్వారా ఇటువంటి అధ్యయనాలను ప్రోత్సహించాలి.
ప్రభుత్వ సంస్థలు ఈ ప్రతిపాదన యొక్క యోగ్యతను చూసి, ఐదు భాషల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తే తప్ప, నిజమైన పురోగతి జరగదు.
ప్రతిపాదన యొక్క ప్రభావం మరియు ఉపయోగం యొక్క వివిధ పారామితులకు సంబంధించి ఇటువంటి అధ్యయనాల ఫలితాలు వృత్తిపరమైన విద్యా పత్రికలలో ప్రచురించబడవచ్చు.
స్వతంత్ర అధ్యయనాల ఫలితాలను బట్టి, ప్రతిపాదిత బోధనా విధానం దాని స్వంత జీవితాన్ని మరియు ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

ఇది ఈ సందేశం యొక్క పరిధికి మించినది; కానీ ఇలా చెబితే సరిపోతుంది, న్యూరోబయోలాజికల్ పరిశోధనా అధ్యయనాలు బహుళ భాషలను కలపడాన్ని సాధన చేయడం అనేది మెదడులో బూడిదరంగు పదార్థ సాంద్రతలో పెరుగుదలతో సహా విస్తృతమైన క్రియాత్మక మరియు నిర్మాణాత్మక మార్పులను కలిగిస్తుంది అని నిరూపిస్తాయి.
కార్య నిర్వహణ మరియు జ్ఞాన నియంత్రణకు సంబంధించి మెదడులోని న్యూరల్ నెట్‌వర్క్‌ల లోపల మరియు మధ్య బహుభాషావాదం ఎక్కువ క్రియాశీల సంధాయకతకు దారితీస్తుంది.
ఇది భాషా జోక్యం మరియు వివాద పరిష్కారాన్ని నిర్వహించడంలో ఎక్కువ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది, బహుళ భాషల సమాంతర లేదా ఏకకాల అభ్యాసం యొక్క ప్రయోజనాలను నొక్కి చెబుతుంది.
చివరగా, బహుభాషావాదం అల్జీమర్స్ వ్యాధి ఆగమనాన్ని ఆలస్యం చేస్తుందని పేరుగాంచింది.
ఒక వ్యక్తికి ఎన్ని ఎక్కువ భాషలు తెలిస్తే ఆగమనం అంత ఆలస్యమవుతుంది, భావి వయో వృద్ధులకు అల్జీమర్స్ యొక్క అనివార్యతకు వ్యతిరేకంగా ఇది బీమా యొక్క ఒక రూపంగా సమర్థవంతంగా పనిచేస్తుంది.
కాబట్టి బహుళ భాషలను నేర్చుకోవడం అనేది ఒక వ్యక్తి యొక్క స్వంత ప్రయోజనానికి -మరియు సహజంగా దేశ ప్రయోజనానికి.
విద్యార్థి మరియు/లేదా తల్లిదండ్రులు దానిని స్వాగతించటానికి తమకు ఉండే అంతర్నిర్మిత ప్రయోజనాన్ని మొదట గుర్తించాలి.
ప్రస్తుత ప్రతిపాదన బహుభాషావాదం యొక్క సంభావ్య ప్రభావాలను మరియు ప్రయోజనాలను పరిశీలించడానికి చేసే పరిశోధన కోసం సారవంతమైన నేలగా ఉపయోగపడవచ్చు.

ఈ ప్రతిపాదన ఉపయోగకరమైన చర్చ మరియు వాదనను సృష్టిస్తుందని భావిస్తున్నాను.
ప్రారంభించడానికి, ఇది ఎంచుకున్న పాఠశాలల్లో అందించబడవచ్చు లేదా ప్రత్యామ్నాయంగా చురుకైన విద్యార్థులకు ఐచ్ఛిక మార్గంగా అందించబడవచ్చు, విద్యార్థి యొక్క విజయవంతమైన పనితీరు ఆధారంగా గణనీయమైన ఆర్థిక ఉపకార వేతనంతో జతచేయబడి.
ముందుకు వెళ్ళే ముందు భాషావేత్తలు, భాషా పండితులు ముందుకు వచ్చి అవసరమైన పాఠ్యప్రణాళికలు, పాఠ్యాంశాలను తయారు చేస్తారని భావిస్తున్నాను.
నిస్సందేహంగా, ఇది ఒక పెద్ద కార్యక్రమం మరియు దీనికి ప్రభుత్వ అండ మరియు మద్దతుతో భాషా నిపుణుల సమన్వయ కృషి అవసరం.
ఈ వెబ్‌సైట్ యొక్క ఉద్దేశ్యం ఈ ఆలోచనను ప్రజలకు పరిచయం చేసి, దాని అధ్యయనం మరియు అంతిమ ఆమోదాన్ని ప్రోత్సహించడం.
రాబోయే భవిష్యత్తులో అదనపు సమాచారం యథాతదంగా పోస్ట్ చేయబడుతుంది.

మొత్తానికి, బహుళ భాషల అభ్యాసం నిస్సందేహంగా ఇతరుల పట్ల సహనం, మర్యాద మరియు గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.
వాటిని ఏకకాలంలో నేర్చుకోవడం ఒకరి ఆలోచనా శక్తి యొక్క విశాలతను మరియు లోతును పెంచవచ్చు.
దీనిని ఒక ఉన్నత విద్యా ప్రతిపాదనగా కొట్టివేయకూడదు, బదులుగా భారతదేశం వంటి అత్యంత వైవిధ్యభరితమైన దేశానికి బ్రహ్మాండమైన సంభావ్య ఆచరణాత్మక ప్రయోజనం యొక్క ఫలితాలను ఇచ్చే ప్రయోగంగా పరిగణించబడాలి.
ఈ ప్రతిపాదన ప్రపంచంలోని ఇతర బహుభాషా దేశాలకు ఇంతే సమానంగా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈశ్వర్, అల్లా మీ పేరు (మారుపేరు)
అందరినీ సమభావముతో దీవించు భగవాన్ (భగవంతుడు)
హిందీ ఉర్దూ సంస్కృతం మన జబాన్ (భాష)
భిన్నత్వం మన ఖాన్ దాన్ (పరంపర)
మనం కలిసుంటే బల్వాన్ (బలం)
ఈశ్వర్, అల్లా మీ పేరు (మారుపేరు)
అందరినీ సమభావముతో దీవించు భగవాన్ (భగవంతుడు)

జై హింద్, జై ప్రపంచం
మే 15, 2019

తెలుగు భాష మాట్లాడే స్థానిక వక్త (హిందీ, ఉర్దూ, సంస్కృతం) దీనిని ఆంగ్లంలో డాక్టర్ శేషి వ్రాసిన అసలు నుండి అనువదించారు.